: ఐఎన్ఎస్ సుమిత్రాలో రాష్ట్రపతి, ప్రధాని... విశాఖలో ఐఎఫ్ఆర్ ప్రారంభం
నవ్యాంధ్ర ఎకనమికల్ కేపిటల్ విశాఖలో అంతర్జాతీయ నావికా దశ సమీక్ష (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ) ఘనంగా ప్రారంభమైంది. నిన్ననే ఈ వేడుక ప్రారంభమైనప్పటికీ ఫ్లీట్ రివ్యూలో అసలు కార్యక్రమాలకు నేటి నుంచి తెర లేవనుంది. ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రికే విశాఖకు చేరుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వారిద్దరికీ ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితం ఐఎఫ్ఆర్ లో అసలు సిసలైన కార్యక్రమాలను ప్రణబ్ ప్రారంభించారు. విశాఖ డాక్ యార్డ్ లో భారత నావికా దళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన నేరుగా ఐఎన్ఎస్ సుమిత్రాలోకి ప్రవేశించారు. అప్పటికే సుమిత్రాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిద్దరూ ఐఎన్ఎస్ సుమిత్రాలో పయనిస్తూ భారత నావికాదళ సంపత్తి వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఐఎన్ఎస్ సుమిత్రాలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు.