: ఇక ఎయిరిండియా విమానాల్లో షడ్రుచుల భోజనం!
ఇకపై ఎయిరిండియా విమానాల్లో ఏడు రకాల భారతీయ వంటకాలతో కూడిన భోజనం లభించనుంది. ఇప్పటి వరకూ ఫాస్ట్ ఫుడ్, ఇన్ స్టంట్ బిర్యానీ, స్నాక్స్, చపాతీ, ఇడ్లీ వంటివి మాత్రమే విమానాల్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మెనూల్లో ఉండగా, ఇకపై అన్నం, పప్పు, కూర, పనీర్, పెరుగు వంటివన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ముంబై - ఢిల్లీ సెక్టార్లో భారతీయ భోజనాన్ని అందిస్తున్న ఎయిర్ ఇండియా, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి ఇతర మార్గాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తామని చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మెనూకు మంచి స్పందనే వస్తోందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహానీ వెల్లడించారు. మెనూలో శాకాహార, మాంసాహార వెరైటీలుంటాయని, వాటి నుంచి ఏడింటిని ఎంచుకోవచ్చని తెలిపారు. అయితే, ఈ భోజనం సర్వింగ్ కు ఎక్కువ సమయం పడుతోందని ఎయిర్ హోస్టెస్ లు వాపోతుండటం గమనార్హం. గతంలో ఫుడ్ ప్యాక్ మొత్తాన్నీ ఒక్కసారిగా వేడి చేసే వారమని, ఇప్పుడు అన్ని వంటకాలనూ విడివిడిగా వేడి చేయాల్సి వస్తోందని, ఆపై వాటన్నింటినీ విడివిడిగా వడ్డించాల్సి వస్తోందని వారు అంటున్నారు. దీంతో కనీసం రెండు గంటల ప్రయాణ సమయమున్న విమాన సర్వీసుల్లోనే ఈ సౌకర్యం అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.