: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు షాక్... ఎక్స్ అఫీసియో హోదా నిబంధన మార్పుపై ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ సర్కారుకు మరోమారు షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నికలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీసియో సభ్యుల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. ఈ హోదాలో గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కుంది. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, కార్పొరేటర్ల సీట్లు కాస్తంత తక్కువగా వచ్చినా, ఎక్స్ అఫీసియో సభ్యుల ఓట్లతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదిపింది. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఓటు హక్కుతో పనిలేకుండా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీలందరికీ ఎక్స్ అఫీసియో హోదా కట్టబెడుతూ జీవో జారీ చేసింది. దీనిపై దాఖలైన వ్యాజ్యంపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే, గ్రేటర్ పరిధిలో ఓటరుగా ఉంటేనే సదరు ఎమ్మెల్సీకి ఎక్స్ అఫీసియో హోదా ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. ఆ నిబంధనను మారుస్తూ గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్సీలందరికీ ఎక్స్ అఫీసియో హోదాను కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పింది. దీనిపై నేడు మరోమారు జరగనున్న విచారణలో ప్రభుత్వం తన వాదనను వినిపించనుంది. ప్రభుత్వ వాదనకు కోర్టు ఏ మేరకు సంతృప్తి వ్యక్తం చేస్తుందో వేచి చూడాలి.