: అసదుద్దీన్ ని నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు చేయాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం సందర్భంగా ఎంఐఎం నేతల దాడులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆయనపై బెయిలబుల్ కేసులు పెట్టడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్లు జరిగిన 3 డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని వారు ఈసీ నాగిరెడ్డిని కోరారు. ఆయనను కలిసిన వారిలో టీకాంగ్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ముఖేష్ గౌడ్, టీడీపీ నేత ఎల్.రమణ, బీజేపీ నేత లక్ష్మణ్ ఉన్నారు.