: ఇక ఆత్మహత్యే శరణ్యమంటున్న 60 మంది దళిత విద్యార్థులు!
ఒడిశాలోని భువనేశ్వర్ పట్టణంలోని రాజధాని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీహార్ కు చెందిన 60 మంది దళిత విద్యార్థులు తమకు ఆత్మహత్య మినహా మరో మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టయిఫండ్ రాలేదని, ఎన్నిమార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, తక్షణం సమస్య పరిష్కరించకుంటే, చనిపోతామని హెచ్చరించారు. వీరంతా డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుండగా, ఫీజు బకాయిలు చెల్లించని కారణంగా వీరిని కాలేజీల నుంచి, హాస్టళ్ల నుంచి గత నెల 8న బలవంతంగా బయటకు పంపించి వేశారు. ఈస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన 18 మంది, వెస్ట్ చంపారన్ కు చెందిన 42 మంది 2014 నాటి ప్రభుత్వ దళిత ఉపకార వేతన పథకంలో భాగంగా కాలేజీలో అడ్మిషన్లు పొందారు. వీరెవ్వరికీ స్టయిఫండ్ ను ప్రభుత్వం జారీ చేయలేదని తెలుస్తోంది. దీంతో లోకనాథ్ కుమార్, గజేంద్ర కుమార్, ముఖేష్ కుమార్, ఉజ్వల్ కుమార్ అనే విద్యార్థులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తమకు విద్య, హాస్టల్ వసతులకు సరిపడినంత నిధులను విడుదల చేయాలని, లేకుంటే అందరమూ ఆత్మహత్య చేసుకుంటామని ఓ ప్రకటన వెలువరించారు. కాగా, ఈ లేఖపై స్పందించిన ఎస్సీ/ఎస్టీ సంక్షేమ విభాగం కార్యదర్శి ఎస్ఎం రాజు, సాధారణంగా ఉపకార వేతనాల చెల్లింపు ఆలస్యం కాదని, వీరి కేసులో ఏం జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.