: అగ్గిపుల్ల వేస్తే ట్రైన్ కాలిపోతుందా? తుని ఘటన తీవ్రమైనదే!: పవన్ కల్యాణ్
తునిలో చోటుచేసుకున్న ఘటన తీవ్రమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఓ వ్యక్తి ఆవేశంలో ఓ అగ్గిపుల్ల గీసి వేస్తే ట్రైన్ కాలిపోదని అన్నారు. ఒక ట్రైన్ కు నిప్పంటించారంటే అది సాధారణ విషయం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల సమస్యలు జటిలం అవుతాయి తప్ప, పరిష్కారం కావని ఆయన అన్నారు. సాధారణంగా ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్రల్లో ఇలాంటి ఘటనలు అరుదు అని ఆయన చెప్పారు. అయినా జరిగాయంటే దీని వెనుక ఎవరున్నారన్నది నిగ్గుతేలాల్సిందేనని ఆయన అన్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగిందంటే దీని వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని, వాటిని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. 12 బోగీలు కాలిపోయాయంటే ఇది అసాంఘిక శక్తులు చేసిన పనేనని ఆయన తెలిపారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమం శాంతియుత వాతావరణంలో జరగాలని ఆయన చెప్పారు.