: యూనివర్సిటీల్లో కుల వివక్ష లేదా?...రోహిత్ ఆత్మహత్య బాధ కలిగించింది: పవన్ కల్యాణ్
యూనివర్సిటీల్లో కుల వివక్ష ఉందన్నది ఎవరూ కాదనలేని అంశమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ ఆత్మహత్య సంఘటన తనను కలచివేసిందని అన్నారు. ఈ ఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందాలని అంతా చూస్తున్నారని, అందులో తాను భాగం కాదల్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో జరిగే విషయాలు తనకు వ్యక్తిగతంగా తెలుసని ఆయన చెప్పారు. విద్యాలయాలుగా గొప్పగా విలసిల్లాల్సిన యూనివర్సిటీల్లో ఎవరి కులం ప్రొఫెసర్లు ఆ కులానికి చెందిన విద్యార్థులతో గ్రూపుగా ఏర్పడడం వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. ఇలాంటి ఆచార్యుల వల్లే ఓ ఉత్తమ విద్యార్థి అకారణంగా ఆత్మహత్యకు పాల్పడడం బాధించిందని ఆయన చెప్పారు. విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లలో కుల భావనలు ఉండడం దురదృష్టమని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రధానంగా రోహిత్ అంశంలో ఎవరినో తప్పుపట్టాలన్నది తన ఉద్దేశ్యం కాదని, రోహిత్ ను ఆత్మహత్యకు పురికొల్పేలా జరగకుండా ఉండాల్సిందని పవన్ కల్యాణ్ చెప్పారు.