: రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఆ తర్వాత ప్రతి ప్రభుత్వం కాపులను నిర్లక్ష్యం చేస్తోంది!: పవన్ కల్యాణ్
నిన్న తునిలో జరిగిన కాపు గర్జన సభ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాదులో మధ్యాహ్నం నాలుగు గంటలకు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రైన్ ను తగులబెట్టడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎవరికి ఏ సమస్యలున్నా వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని కోరుకుంటానన్నారు. తునిలో దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని, ఇలా జరగడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన చెప్పారు. కాపు రిజర్వేషన్ అంశం ఇప్పటిది కాదని, మద్రాసు ప్రెసిడెన్సీ కాలం నుంచి ఉందని ఆయన చెప్పారు. అప్పట్లో కాపులు బీసీలుగా కొనసాగారని ఆయన స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉందని ఆయన అన్నారు. కాపులు అనేది కేవలం ఒక తెగ లేక సమూహం కాదని ఆయన చెప్పారు. కాపు అనేది అనేక తెగల సమూహమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ, ఉత్తరాంధ్రలో కాపులు వెనుకబడిన కులాలుగా వ్యవహరించబడుతున్నారని, అదే సమయంలో రాయలసీమ, కోస్తాలలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు లేదని ఆయన చెప్పారు. ప్రతి ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి రావడం, తరువాత వారిని నిర్లక్ష్యం చేయడంతో తమను ఓటుబ్యాంకుగా వినియోగించుకుంటున్నారనే ఆందోళన వారిలో నెలకొందని ఆయన చెప్పారు. నిన్న జరిగిన ఘటనలు దురదృష్టకరమైన సంఘటనలుగా భావించాలని ఆయన కోరారు.