: వెనక్కి తగ్గిన ముద్రగడ...ఆమరణ దీక్ష వాయిదా... ఉద్యమంపై విష ప్రచారం జరుగుతోందని ఆవేదన!
రిజర్వేషన్ల కోసం తాము సాగిస్తున్న ఉద్యమం ఏక్క రాజకీయ పార్టీకో అనుకూలం కాదని కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. నిన్న తునిలోని కొబ్బరి తోటలో జరిగిన కాపు ఐక్య గర్జనకు హాజరైన లక్షలాది మంది కాపులు ధ్వంస రచనకు దిగారు. ఈ క్రమంలో నిన్న రాత్రి పది గంటల దాకా జాతీయ రహదారిపైనే బైఠాయించిన ముద్రగడ ఆ తర్వాత అక్కడి నుంచి లేచారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ ఉద్యమంపై జరుగుతున్న విష ప్రచారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక నేటి సాయంత్రంలోగా ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ ను ఆయన వాపస్ తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన నేరుగా ప్రకటించకుండా, తన ఆమరణ దీక్షను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నానని, నాలుగైదు రోజుల్లో చేస్తానని ప్రకటించారు. తమ జాతితో పాటు తాను కూడా అమ్ముడుబోయానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది విష ప్రచారమని ముద్రగడ అన్నారు. అయినా కాపులకు రిజర్వేషన్లు అన్నది ఈనాడు తెరపైకి వచ్చిన అంశం కాదని, ఏళ్ల తరబడి ఈ డిమాండ్ ఉన్నదేనని ఆయన తెలిపారు. కాపులను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం సరికాదని ఆయన సూచించారు. తమ ఆకలి బాధను తీర్చమని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యమాన్ని ఆఖరి పోరాటంగా ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఉధ్యమాన్ని మాత్రం కొనసాగిస్తానని ముద్రగడ ప్రకటించారు. ఉద్యమాన్ని ఎవరో ప్రేరేపిస్తున్నారని చెప్పడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.