: తుని హింసలో కాపులు లేరు... శ్రీవారి పాదాల చెంత ఎమ్మెల్యే సుగుణమ్మ సంచలన ప్రకటన
తూర్పుగోదావరి జిల్లా తునిలో నిన్న చోటుచేసుకున్న హింసాకాండలో కాపులెవరూ పాలుపంచుకోలేదని తిరుపతి ఎమ్మెల్యే, దివంగత కాపు నేత వెంకటరమణ సతీమణి సుగుణమ్మ పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత ఆమె తన అనుచరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి... కాపులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే దిశగా పయనించాలని ఆమె దేవుడిని ప్రార్థించారు. అంతేకాక ‘బీసీ- కాపు ఐక్య వేదిక’ పేరిట కొత్త సంస్థకు సుగుణమ్మ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తుని హింసలో కాపులు పాలుపంచుకోలేదని, కొన్ని దుష్ట శక్తులు ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడమే కాక రిజర్వేషన్లు కల్పిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.