: 50 ఏళ్లకే పదవీ విరమణ కోరుతున్న 61 శాతం మంది: హెచ్ఎస్బీసీ స్టడీ
ప్రస్తుతం 45 సంవత్సరాల వయసున్న ఉద్యోగుల్లో 61 శాతం మంది వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ తీసుకుని విశ్రాంత జీవితాన్ని గడపాలని భావిస్తున్నారు. వీరిలో అత్యధికులు తమపై ఉన్న పని ఒత్తిడితో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం పాడైపోతున్నదని భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇక ఇప్పట్లో రిటైర్ కాబోమన్న వారు ఆర్థిక స్థిరత్వాన్ని ఇంకా పొందకపోవడమే కారణమని హెచ్ఎస్బీసీ తాజా సర్వే వెల్లడించింది. 'ది ఫ్యూచర్ ఆఫ్ రిటైర్ మెంట్ హెల్తీ న్యూ బిగినింగ్స్' పేరిట బ్యాంకు అధ్యయనం నిర్వహించగా, అందులో పాల్గొన్న వారిలో 14 శాతం మంది ఇప్పడప్పుడే చేస్తున్న పనిని ఆపేయలేమని వెల్లడించారు. ఇండియన్స్ లో త్వరగా సేవింగ్స్ ప్రారంభించి, ముందుగానే పదవీ విరమణ తరువాత జీవనానికి ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ అధ్యయనం తరువాత వెల్లడైనట్టు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. 43 శాతం మంది రిటైర్ మెంట్ తరువాత కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తామని తెలుపగా, 34 శాతం మంది వివిధ ప్రాంతాలు చుట్టి వస్తామని, 20 శాతం స్వచ్ఛంద సేవలు చేయడం, మరో కెరీర్ లో కాలం గడపడం వంటి పనులు చేస్తామని తెలిపినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా రిటైల్ బ్యాంకింగ్ విభాగం హెడ్ ఎస్.రామకృష్ణన్ వెల్లడించారు. ఇక ఇదే సర్వేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించగా, అత్యధికంగా అర్జెంటీనాలో 78 శాతం, ఫ్రాన్స్ లో 77 శాతం, చైనాలో 75 శాతం, బ్రిటన్ లో 75 శాతం మంది ముందస్తు పదవీ విరమణ కోరుతున్నారని తెలిపారు.