: రంగంలోకి ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్... ప్రత్యేక విమానంలో విశాఖకు చేరిక, మరికాసేపట్లో తునికి!
హింసాత్మకంగా మారిన కాపు ఐక్య గర్జన నిన్న తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉద్రిక్త పరిస్థితులకు తెర తీసింది. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల తరబడి కష్టించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినా, అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కి కాపులు నిప్పు పెట్టిన నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం చెవిన వేశారు. అంతేకాక తమ శాఖకు చెందిన ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై కాస్తంత లోతుగా ఆరా తీసిన కేంద్రం... పారా మిలటరి బలగాల మోహరింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ఆదేశాలతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన సిబ్బంది ప్రత్యేక విమానంలో తునికి బయలుదేరారు. ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్టుకు చేరిన కేంద్ర బలగాలు మరికాసేపట్లో తునిలో అడుగుపెట్టనున్నాయి.