: బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి ముద్రగడ... అనుసరించిన జనం!
కాపు ఐక్య గర్జన సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. కాపులను బీసీల్లో చేర్చే వరకూ తమ ఉద్యమం ఆగదని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇందుకు సంబంధించిన రెండు జీవోలను ఇచ్చే వరకూ రైల్ రోకోలు, రాస్తారోకోలతో స్తంభింపజేద్దామని, ఉద్యమ కార్యాచరణను తక్షణం అమలు చేద్దామని అన్నారు. ‘బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళదాం.. పదండి’ అంటూ ముద్రగడ అనడంతో సదస్సుకు హాజరైన వారు మరింత ఉత్సాహం కనబరిచారు. సంబంధిత జీవో విడుదలయ్యే వరకూ ఇంటికి వెళ్లమని, ఈ ఉద్యమంలో తనతో పాటు తన కుటుంబం కూడా పాల్గొంటుందని.. ఇళ్లల్లో ఉన్న పెద్దలు కూడా రోడ్లపైకి రావాలని.. రిజర్వేషన్ల కోసం గళం విప్పాలని ముద్రగడ ఉద్వేగంగా ప్రసంగించారు. ముద్రగడతో పాటు వందలాది మంది కాపు కులస్తులు, రాజకీయ నాయకులు, తదితరులు సభా స్థలం నుంచి హైవే, రైల్వే ట్రాక్ లను దిగ్బంధించేందుకు బయలుదేరి వెళ్లారు.