: వచ్చే మూడేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు: గడ్కరీ


భారత రహదారి రంగం వచ్చే మూడేళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన రహదారుల విస్తరణ ప్రాజెక్టులు ఈ ఉద్యోగాలను దగ్గర చేయనున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం నాడు ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఇప్పటికే రూ. 1.5 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించామని, ప్రతి కోటి రూపాయల పెట్టుబడితో 800 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. "ఒక్క నా మంత్రిత్వ శాఖ నుంచే 50 లక్షల ఉద్యోగాలు రావడంతో పాటు 2 శాతం జీడీపీ పెరుగుతుంది. ఉక్కు, సిమెంట్ రంగాలకు సైతం ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడున్న 96 వేల కిలోమీటర్ల రహదార్ల పొడవును వచ్చే నాలుగేళ్లలో 1.5 లక్షల కిలోమీటర్లకు పెంచాలన్నదే మా లక్ష్యం" అని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకానికి తదుపరి బడ్జెట్ లో అధిక కేటాయింపులు జరుగుతాయని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. తమ శాఖలో లక్ష్యాలను ముందుగానే సాధిస్తున్నామని వెల్లడించిన ఆయన, ప్రస్తుతం రోజుకు 18 కి.మీ పొడవైన రోడ్లను నిర్మిస్తున్నామని, దీన్ని మార్చి నాటికి రోజుకు 30 కి.మీకి పెంచుతామని అన్నారు.

  • Loading...

More Telugu News