: రాహుల్ ది నీచ రాజకీయం, దళితులు, వ్యతిరేకులన్న పిచ్చి పోవాలి: వెంకయ్యనాయుడు


విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో దళితులు, దళిత వ్యతిరేకులన్న పిచ్చి భావన తొలగిపోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్, బంజారాహిల్స్ లో జరిగిన ఉత్తర భారతీయ మంచ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఘటనలను ప్రస్తావిస్తూ, ఓ దురదృష్టకర ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. వీరి రాజకీయాలతో రోహిత్ ఆత్మ రోధిస్తోందన్నారు. సమాజంలో మానసిక పరివర్తన తీసుకురావడానికి అందరూ సహకరించాలని కోరారు. కంటి ముందు కనిపిస్తున్న అభివృద్ధి, పనిచేసిన, చేస్తున్న ప్రభుత్వాలపై విశ్వాసం ఉంచాలని అన్నారు. తెలుగు నేలపై అభివృద్ధిని కళ్లకు కట్టిన ఎన్టీఆర్ ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో గృహ నిర్మాణ పథకం కింద 29 వేల ఇళ్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. హైదరాబాద్ లో ఎవరూ సెటిలర్లు కాదని, అంతా భారతీయులేనని వ్యాఖ్యానించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పట్ల సానుభూతిని చూపే వారే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.

  • Loading...

More Telugu News