: యూఏఈ నుంచి వచ్చిన ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల అరెస్ట్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లగొట్టిన ముగ్గురు ఐఎస్ఐఎస్ సానుభూతి పరులైన భారతీయులను భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ సానుభూతి పరులుగా మారిన వీరు ముగ్గురూ వివిధ దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నారు. దీనిని గుర్తించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారిని దేశం నుంచి బహిష్కరించి, స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఫర్హాన్, కర్ణాటకకు చెందిన అద్నాన్ హుస్సేన్, జమ్మూకాశ్మీర్ కు చెందిన షేక్ అల్ ఇస్లాం లను విమానం దిగగానే అధికారులు అరెస్టు చేసి జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగించారు. దీంతో వారిని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని పదిరోజుల కస్టడీ నిమిత్తం ఎన్ఐఏ అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, విశాఖపట్టణంలో జరగనున్న నేవీ ఫ్లీట్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదినోత్సవ వేడుకల్లో పటిష్ఠభద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోని పంజాబ్ లో తీవ్రవాదుల సంచారం కలకలం రేపుతోంది. దీనికి తోడు భారత్ లో పాగా వేసేందుకు ఐఎస్ఐఎస్ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పాకిస్థాన్ నుంచి నిధులు అందజేస్తున్న ఉగ్రవాదసంస్థల సాయంతో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.