: ప్రొఫెసర్ పెరియాస్వామి అందరికీ ఆమోదయోగ్యుడు... హెచ్ సీయూలో ఆందోళనలకు చెక్ పడినట్లే!


రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు మిన్నంటాయి. రోజుల తరబడి విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు వర్సిటీని సందర్శించారు. ఈ క్రమంలో రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు నిరవధిక సెలవుపై వెళ్లారు. దీంతో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్న విపిన్ శ్రీవాస్తవ ఇన్ చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. అయితే రోహిత్ సస్పెన్షన్ కు సిఫారసు చేసిన కమిటీకి నేతృత్వం వహించిన శ్రీవాస్తవను వర్సిటీకి ఇన్ చార్జి వీసీగా ఎలా నియమిస్తారని విద్యార్థులు భగ్గుమన్నారు. దీంతో నిన్న రాత్రి రాహుల్ గాంధీ వర్సిటీలో అడుగుపెట్టడానికి కాస్తంత ముందుగా శ్రీవాస్తవ కూడా నాలుగు రోజుల సెలవులో వెళ్లారు. తాజాగా ఆయన తర్వాత సీనియర్ మోస్ట్ గా ఉన్న పెరియాస్వామి ఇన్ చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. మృదు స్వభావి అయిన పెరియాస్వామి వర్సిటీలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడిగా ఉన్నారు. పెరియాస్వామిని ఇన్ చార్జి వీసీగా కాకుండా రెగ్యులర్ వీసీగా నియమిస్తే తమకేమీ అభ్యంతరం లేదని అటు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ- రోహిత్ ప్రాతినిధ్యం వహించిన విద్యార్థి సంఘం) తో పాటు ఏబీవీపీ, మెజారిటీ విద్యార్థులు బహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లోని భావనను గుర్తించిన నేపథ్యంలోనే వర్సిటీ అధికారులు పెరియాస్వామికి బాధ్యతలు అప్పగించినట్లుగానూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను రెగ్యులర్ వీసీగా నియమిస్తే, వర్సిటీలో ఆందోళనలు సద్దుమణుగుతాయన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే దిశగా కేంద్రం కూడా చర్యలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. అంటే నేడో, రేపో వర్సిటీలో పరిస్థితులన్నీ సాధారణ స్థితికి రానున్నాయన్న మాట.

  • Loading...

More Telugu News