: గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ గెలుపు ఖాయం: చంద్రబాబు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ గెలుపు ఖాయమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ టీడీపీ కేడర్ బలంగా ఉందని, కొంతమంది పార్టీని వీడినా వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. తెలుగుదేశంపై ప్రజలకు అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే హైదరాబాద్ లో టీడీపీ-బీజేపీ కూటమి 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు గెలవటమని ప్రస్తావించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తాము ముందుచూపుతో హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేశామన్నారు. హైటెక్ సీటీ ప్రాంతంలో గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దాని నిర్మాణంతో హైదరాబాద్ దశ తిరిగిందని తెలిపారు. నగరంలో పెట్టుబడుల కోసం తమ హయాంలో అమెరికాలో తిరిగామని వివరించారు.