: 28 ఏళ్ల తర్వాత ఆ పట్టణంలో ఒక శిశువు జన్మించింది!
ఇటలీ దేశంలోని పైడ్ మాంట్ పర్వత ప్రాంతంలోని ఒక పట్టణం ఒస్తానా. ఆ పట్టణ జనాభా 85 మంది. ఇందులో 41 మంది మాత్రమే సంవత్సరం పొడవునా ఇక్కడే ఉంటారు. మిగిలిన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం, ఈ పట్టణంలో యువకులన్నవారు లేరు.. కొత్త శిశువులు జన్మించడం లేదు. 1987లో అక్కడ చివరిసారిగా ఒక శిశువు జన్మించాడు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఆ పట్టణంలో ఒక శిశువు ఏడుపు వినిపించింది. గత వారం జోస్, సిల్వియా దంపతులకు మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ పేరు పబ్లిటో. అయితే, ఈ గ్రామంలో ఇంత తక్కువ జనాభా ఉండటానికి కారణమేమిటి? అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం! దాని వెనుక కథేమిటంటే... మారుమూల పట్టణమైన ఒస్తానా 1900 సంవత్సరంలో అన్ని పట్టణాల్లాగే ఉండేది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అక్కడి శిశువుల సంఖ్య 1000 నుంచి 700కు తగ్గింది. ఆ తర్వాత అభివృద్ధి అనేది క్రమక్రమంగా దూరమైంది. దీంతో, అక్కడి ప్రజలు వలస బాట పట్టారు. అక్కడి ప్రజలు వలస వెళ్లడమనేది 1980ల కంటే ముందే జరిగింది. ఇదే సంవత్సరాల్లో కేవలం ఐదుగురు మాత్రమే శాశ్వత పౌరులు ఉండటంతో, అక్కడి ప్రభుత్వాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పట్టణంలో జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. అయినా, ఫలితం లేకుండా పోయింది. తాజాగా, అక్కడ నూతన శిశువు జన్మించడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.