: ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, టీఆర్ఎస్సే గెలుస్తుంది: కేటీఆర్
ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ‘గ్రేటర్’ పీఠంపై గులాబి జెండా ఎగురుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘గ్రేటర్’ ఎన్నికల సందర్భంగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం తాను వారం రోజులుగా తిరుగుతున్నానని, టీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ‘గ్రేటర్’ ఎన్నికల్లో వందసీట్లు సాధిస్తామని గతంలో చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉంటానని కేటీఆర్ అన్నారు. ఒకవేళ వందసీట్లు సాధించకపోతే ఏమి చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘ఆ అనుమానమే వద్దు.. గులాబి జెండా ఎగురుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోయినా మేమే అధికారం చేపడతాము. ఎట్లా అంటే.. స్పష్టమైన సీట్లు సాధిస్తాం. సాధించని పక్షంలో మాకు ఎక్స్ అఫీషియో సభ్యులు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, మజ్లిస్ మాకు మిత్ర పక్షంగా ఉంది కనుక, ‘గ్రేటర్’ పీఠం మాదే’ అని కేటీఆర్ వివరించారు.