: తమిళనాడులో 'అమ్మ' పథకాలు, ప్రకటనలపై కోర్టులో వ్యాజ్యం
తమిళనాడులో ఇటీవల ప్రతి ప్రభుత్వ పథకానికి 'అమ్మ' పేరు పెట్టడంపై మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పేర్లకు అమ్మ, పురుచ్చి తలైవి అని చేర్చడం, ఆ పేరిట ప్రకటనల్లో ప్రచురించడంపై న్యాయవాది పి.రథినం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ వేశారు. ఇకముందు అలాంటి ప్రకటనలు, అటువంటి పనులు చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని పిటిషన్ లో కోరారు. అంతేగాక ప్రజల సొమ్మును ఇలా పథకాల పేరిట వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా ఉండేలా చూసేలా కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలివ్వాలని కోరారు. తమిళనాడు సీఎం జయలలిత వ్యక్తిగత ప్రచారం కోసమే ఇలా ఆయా పథకాలకు ఆమె పేరు పెడుతున్నారని, ప్రకటనల్లో కూడా పేరును చేర్చి ప్రజలను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్ లో తెలిపారు. అమ్మకాల్ సెంటర్, అమ్మ మైక్రో లోన్స్ అంటూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి వేలకోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని పేర్కొన్నారు.