: బెజవాడలో భారీ పేలుడు... రంగంలోకి దిగిన డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో నేటి ఉదయం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని పంటకాలువ రోడ్డులోని విజయనగరకాలనీకి చెందిన ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడే జరిగిందని తొలుత భావించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో బాంబులు పేలి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వెనువెంటనే డాగ్, బాంబు స్క్వాడ్ లు రంగంలోకి దిగిపోయాయి. పేలుడు జరిగిన ఇంటిలో క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. భారీ శబ్దంతో కూడిన పేలుడుతో నగర జనం భయాందోళనలకు గురయ్యారు. పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పేలుడు జరిగిన ఇంటిలో స్క్రాప్ బిజినెస్ చేసే ఓ కుటుంబం ఉంటున్నట్లు సమాచారం. ఘటనలో భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న వారిద్దరినీ స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారు స్పృహలోకి వచ్చి నోరిప్పితే అసలు విషయం వెలుగుచూసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News