: ‘అమ్మ’కు కోపమొచ్చింది!... పార్టీని విమర్శించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన జయలలిత


అక్రమ సంపాదనకు సంబంధించి కేసులు చుట్టుముట్టిన నేపథ్యంలో జైలుకెళ్లి వచ్చిన జయలలితలో కాస్తంతైనా కోపం తగ్గి ఉంటుందిలే అనుకున్నారో, ఏమో తెలియదు కాని... ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే నోరు జారారు. ‘అమ్మ’గా తమిళ జనాల చేత నీరాజనాలందుకుంటున్న జయలలిత చేతిలో బహిష్కరణకు గురయ్యారు. వివరాల్లోకెళితే... అన్నా డీఎంకే సీనియర్ నేత కరుప్పయ్య హార్బర్ నియోజకవర్గం నుంచి పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి చిన్న విషయానికి బల్లలు చరుస్తారని, ఇలా వారు బల్లలు చరచడం... కంప్యూటర్ లో ముందుగానే రూపొందించిన ప్రొగ్రామ్ మాదిరిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అవినీతి, అక్రమార్జనలో కూరుకుపోయిన మంత్రులు ఒక్కొక్కరు ఐదు నుంచి ఆరుగురు పీఏలను మెయింటెన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సదరు పీఏల్లో ఒకరు మాత్రం కేవలం టవల్ మోయడమే పనిగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సమాచారం అందుకున్న జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని, పార్టీ నేతలను కించపరిచే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పిన జయలలిత, కరుప్పయ్యను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News