: హనుమంతుడి నోట్లో టెంకాయ వేసి...చేతిలో చిప్ప స్వీకరించవచ్చు
సాధారణంగా గుళ్లలో టెంకాయలు కొట్టేచోట రద్దీ నెలకొంటుంది. ఒకేసారి మూకుమ్మడిగా తాము తెచ్చిన కొబ్బరి కాయలను కొట్టేందుకు భక్తులు ఉత్సాహం చూపడంతో కాయల్లోని నీరు వృథాగా పోతుంటుంది. ఈ విషయంపై, గుజరాత్ లోని బర్వాలా తాలూకాలోని సారంగపూర్లోని హనుమాన్ టెంపుల్ నిర్వహకులు వినూత్నంగా ఆలోచించారు. దేవుడికి భక్తులు సమర్పించేది ఏదీ వృథా కాకూడదని తలంచి సరికొత్త ప్రణాళిక ఏర్పాటు చేసింది. అందులో భాగంగా దేవాలయ ద్వారం వద్ద నోరుతెరుచుకున్న హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయంలోకి ప్రవేశించిన భక్తులు హనుమాన్ విగ్రహం నోట్లో కొబ్బరికాయను వేయాలి. ఆ వెంటనే హనుమాన్ చేతి దగ్గర ఏర్పాటు చేసిన పళ్లెంలో ఓ కొబ్బరి చిప్ప ప్రత్యక్షమవుతుంది. భక్తులు దానిని ప్రసాదంగా స్వీకరించవచ్చు. విగ్రహం వెనుక గదిలో ఉన్న వ్యక్తి ఈ ప్రక్రియను నిర్వహిస్తాడు. నీరు, చిప్ప, టెంక, పీచు... ఏవీ వృథా కాకుండా తీసుకునే జాగ్రత్తలో భాగంగా ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. ఈ విధానాన్ని ఇతర గుళ్లలో కూడా అమలు చేసేందుకు పలు దేవాలయ కమిటీలు హనుమాన్ టెంపుల్ ను సందర్శిస్తున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.