: చర్లపల్లిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ... మాజీ ఎమ్మెల్యే బండారు సహా పలువురిపై ఫిర్యాదు
గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి తన కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్యే కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు బండారు సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చర్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.