: కోహ్లీపై అభిమానం పాకిస్థాన్ యువకుడి కొంపముంచింది!
పాకిస్థాన్ లో భారతజాతీయ పతాకాన్ని ఇంటిపై ఎగురవేసిన వ్యక్తిని పాక్ పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాలవెనక్కి తోసేశారు. వివరాల్లోకి వెళ్తే... పాకిస్ధాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తి విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ కోహ్లీ విశేషంగా రాణించాడు. ఈ క్రమంలో భారత గణతంత్రదినోత్సవం రోజున ఆస్ట్రేలియాతో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయం సాధించింది. దీంతో అమితానందభరితుడైన ఉమర్ ద్రాజ్ తన ఇంటిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలపడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఉగ్రవాదిని, గూఢచారిని కాదని, తనకు కోహ్లీ అంటే అభిమానమని, ఆ అభిమానంతోనే ఇలా చేశానని ఉమర్ ద్రాజ్ ఎంత మొత్తుకున్నా వారు విడిచిపెట్టలేదు. తాను ఎలాంటి నేరం చేయలేదని, దేశద్రోహిని కాదని ఉమర్ ద్రాజ్ చెబుతున్నాడు.