: సరదా కోసమట... ముంబైలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన జర్మన్!
జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానాల్లో ఇద్దరు ప్రయాణికులు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. అబూదాబి నుంచి ముంబైకి వచ్చిన విమానంలో ప్రయాణించిన జర్మనీ పౌరుడు స్టీవ్ టిస్లర్, విమానం ఎమర్జెన్సీ డోర్ ను తెరిచాడు. ఆ సమయంలో విమానం ల్యాండింగ్ అయింది కాబట్టి సరిపోయింది. లేకుంటే విమానంలోని అందరి ప్రాణాలూ పోయుండేవి. డోర్ ఎందుకు తీశావని ప్రశ్నిస్తే, 'జస్ట్ ఫర్ ఫన్' అని అతను చెప్పడంతో విమాన సిబ్బంది అవాక్కయ్యారు. ఆపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ రంగప్రవేశం చేసి అతన్ని సహర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు పెట్టినట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఘటనలో సింగపూర్ నుంచి ముంబై వస్తున్న విమానంలో రవి ధన్ కార్ అనే యువకుడు వాష్ రూం వద్ద నిలబడి సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. తనకు దమ్ముకొట్టే అలవాటుందని, కోరికను ఆపుకోలేకనే అలా చేశానని విచారణలో వెల్లడించాడట. విమానాల్లో ఈ తరహా చర్యలు నిషేధం. దీని వల్ల మొత్తం ప్రయాణికుల ప్రాణాలు పోయే ప్రమాదాలు ఏర్పడతాయి. ఈ రెండు ఘటనలపై జెట్ ఎయిర్ వేస్ ప్రకటన వెలువరిస్తూ, ఇది దురదృష్టకరమని, ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపింది.