: భారతీయులకు టీమిండియా రిపబ్లిక్ డే కానుక...తొలి టీట్వంటీ మనదే!
భారతీయ క్రికెట్ అభిమానులకు టీమిండియా రిపబ్లిక్ డే కానుకను అందజేసింది. ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టీట్వంటీ సిరీస్ లో భాగంగా అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీట్వంటీలో భారత జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వన్డేలో సాధించిన విజయం జోరును టీమిండియా కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన భారత జట్టు కేవలం 151 పరుగులకే ఆసీస్ ఆటగాళ్లను వరుసగా పెవిలియన్ పంపి విజయం సాధిచింది. దీంతో తొలి టీట్వంటీలో విజయం సాధించి, మూడు టీట్వంటీల సిరీస్ లో ముందంజవేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు రోహిత్ శర్మ (31) దూకుడుతో ఆరంభంలోనే భారీ స్కోరు దిశగా సాగింది. ఈ దశలో రోహిత్ అవుట్ కావడం, స్కోరు పెంచే క్రమంలో ధావన్ (5) పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం వచ్చిన కోహ్లీ (90), రైనా (41) వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. మరో మూడు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా, రైనా పెవిలియన్ చేరడంతో ధోనీ (11) వస్తూనే విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా 188 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 33 బంతులెదుర్కొన్న ఫించ్ 133.33 స్ట్రయిక్ రేట్ తో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 44 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అశ్విన్ అద్భుతమైన బంతితో ఫించ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ధాటిగా ఆడుతున్న స్మిత్ (21)ను కోహ్లీ క్యాచ్ తో జడేజా పెవిలియన్ కు పంపాడు. జడేజా విసిరిన బంతిని స్వీప్ షాట్ కొడదామని ప్రయత్నించిన హెడ్ (2) దానిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం అద్భుతమైన బంతితో అశ్విన్ షేన్ వాట్సన్ (12) పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం లిన్ (17) కొట్టిన భారీ షాట్ ను యువరాజ్ ఒడిసిపట్టడంతో అవుటయ్యాడు. తరువాత మాథ్యూ వేడ్ (5) జడేజా క్యాతో పెవిలియన్ కు పంపాడు. జేమ్స్ ఫాల్కనర్ (10) ను బుమ్రా బౌల్డ్ చేయగా, రిచర్డ్ సన్ (9) ను నెహ్రా బౌల్డ్ చేశాడు. బోయ్సీ (3) ని బుమ్రా అవుట్ చేయడంతో, ఆసీస్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 151 పరుగులకు ఆలౌట్ గా పెవిలియన్ చేరింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లతో రాణించగా, అశ్విన్, జడేజా, పాండ్య రెండేసి వికెట్లతో రాణించారు. ఒక వికెట్ తీసి నెహ్రా వారికి సహకరించాడు. దీంతో తొలి టీట్వంటీ మ్యాచ్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీ నిలిచాడు.