: అలరించిన క్షిపణులు, ఫ్రాన్స్ సైన్యానికి చప్పట్ల స్వాగతం
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఢిల్లీలోని రాజ్ పథ్ లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పలువురు వీఐపీలు, ప్రముఖుల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. గగన వీధిలో హెలికాప్టర్లు భారత జండాను రెపరెపలాడిస్తూ తీసుకువెళ్లిన వేళ వేడుకలు ప్రారంభమయ్యాయి. భారత అశ్విక దళం, బీఎస్ఎఫ్ జవాన్లు, మహిళా కమాండర్ల కవాతు అనంతరం, తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకున్న 76 మంది ఫ్రెంచ్ సైనికుల బృందానికి వీక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఫ్రాన్స్ సైనికులు కవాతు చేస్తున్నంత సేపూ ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే నవ్వుతూ తిలకించారు. భారత క్షిపణి సామర్థ్యాన్ని అతిధికి చూపుతూ, అగ్ని, పృధ్వి క్షిపణులతో పాటు తేలికపాటి, లాంగ్ రేంజ్ మిసైళ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల శకటాల ప్రదర్శనను కూడా ఆహూతులు ఆసక్తిగా తిలకించారు.