: ‘సాత్ కలాష్ రఖ్ దో’ అన్న తీగ లాగితే కదిలిన ఉగ్ర డొంక!
గత వారం రోజులుగా ఉగ్రవాదుల కోసం సోదాలు జరుపుతున్న భద్రతాదళాలు పలు ప్రాంతాల్లో దాడులు జరిపి 20 మందికి పైగా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరంతా దాదాపు ఏదో ఒక విధంగా ఉగ్రవాదులతో సంబంధాలు నడుపుతున్నవారే. కోట్లాది మంది నివసిస్తున్న భారత్ లో సరిగ్గా వీరే ఉగ్ర అనుమానితులని ఎన్ఐఏ ఎలా కనుగొంది... ఆ వివరాల్లోకి వెళితే, అమెరికా నిఘా సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి వచ్చిన వివరాలు ఎన్ఐఏకు ఎంతో ఉపకరించాయి. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న షఫీ ఆర్మర్, ముదాబిర్ ల మధ్య సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ జరుగుతూ ఉందని గుర్తించిన సీఐఏ, ఇండియాకు గత సంవత్సరం సమాచారం ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి వీరి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు, నవంబర్ తరువాత పరిస్థితి మారిందని, ఏ క్షణమైనా దాడులకు వీరు తెగబడవచ్చని గుర్తించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య వాట్స్ యాప్ మాధ్యమంగా ‘సాత్ కలాష్ రఖ్ దో’ అంటూ మాటలు సాగాయి. తొలుత అధికారులకు దీనర్థం తెలియలేదు. ఆపై దీన్ని డీకోడ్ చేసి ఏడు చోట్ల దాడులు, రెక్కీలకు ప్లాన్ వేశారని తెలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి కోడ్ భాషను డీకోడ్ చేస్తూ వచ్చి, జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ పేరిట కొత్త సంస్థ ఏర్పడిందని గుర్తించారు. అనుమానితుల సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్ ఐపీ అడ్రస్ లను సేకరించారు. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడుతున్నారో గమనిస్తూ వచ్చారు. ఆపై ఇంకేముంది, అందరి అరెస్టుకు హోం మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, ఒక్కసారిగా దాడులకు దిగారు. హైదరాబాద్ లో అరెస్టయిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, అబు అన్స్ వీరి బ్యాచ్ లోని వారే. అలా భారత్ పై ప్లాన్ చేసిన భారీ ఉగ్రదాడుల గుట్టు రట్టయింది.