: ప్రపంచంలో జరిగే మార్పులను గమనించాలి: సీఎం చంద్రబాబు
దావోస్ సదస్సుకు హాజరుకావడం వల్ల మన చుట్టూ వున్న ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం లభించిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని చంద్రబాబు నిన్న విజయవాడకు చేరుకున్నారు. తన పర్యటన విశేషాల గురించి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అవలంబిస్తున్న కొత్త కొత్త విధానాలపై చర్చించామని, జురిచ్ లో 11 కంపెనీల ప్రతినిధులను తాను కలిశానని చెప్పారు. ఈ సదస్సుకు హాజరుకావడం వల్ల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఏవిధంగా అందించవచ్చో తెలుసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెరుగైన జీవన ప్రమాణాలు ఎలా కల్పించాలనే దానిపై ఒక ఆలోచన చేస్తున్నామని, ఈ ఆలోచన ద్వారా ప్రజల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టవచ్చని, నూతన సాంకేతికతను ఉపయోగించుకుని ఎలా ముందుకెళ్లాలనే విషయమై ఆలోచిస్తున్నామని అన్నారు. పారిశ్రామిక విప్లవం వల్ల లాభనష్టాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకోవ్చని, సాంకేతికయుగంలో నైపుణ్యం, సమర్ధత పెంచుకోగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని ఆయన సూచించారు. ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా మెరుగుపరచుకోవాలనే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు.