: రోహిత్ ఘటనపై చర్యలు షురూ... నిరవధిక సెలవులో వీసీ అప్పారావు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి సర్కారు చర్యలు ప్రారంభించింది. రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు నిరవధిక సెలవుపై వెళ్లారు. ఈ మేరకు నిన్న వర్సిటీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. వర్సిటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలను చల్లబరిచేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖే స్వయంగా వీసీని సెలవుపై వెళ్లేలా ఆదేశాలు జారీ చేసిందన్న ప్రచారం సాగుతోంది. ఇక అప్పారావు స్థానంలో ఇన్ చార్జీ వీసీగా వర్సిటీ భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యుడు విపిన్ శ్రీవాస్తవను నియమిస్తున్నట్లు వర్సిటీ పాలక మండలి ప్రకటించింది. అయితే రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ విధించాలని సూచించిన కమిటీకి శ్రీవాస్తవ నేతృత్వం వహించిన నేపథ్యంలో ఆయనను ఇన్ చార్జీగా అంగీకరించేది లేదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.