: తొలిసారిగా గర్జించిన 'మేకిన్ ఇండియా' యుద్ధ విమానం


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్, బెహరైన్ లో జరుగుతున్న ఎయిర్ షోలో తొలిసారిగా తన నైపుణ్యాలను ప్రదర్శించింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. బెహరైన్ విమానాశ్రయంలో దిగిన వెంటనే సఖీర్ ఎయిర్ బేస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ప్రదర్శన తిలకించారు. ఆమెతో పాటు బెహరైన్ కింగ్ హమద్ బిల్ ఇసా అల్ ఖలీఫా కూడా తేజాస్ విన్యాసాలు తిలకించారు. గాల్లో చక్కర్లు కొడుతూ, పలు రకాల విన్యాసాలను తేజాస్ టీం ప్రదర్శించింది. నిట్ట నిలువుగా ఎగరడం, ఆకాశం నుంచి తల్లకిందులుగా భూమికి అత్యంత సమీపానికి వచ్చి, అంతే వేగంతో గాల్లోకి ఎగరడం వంటి విన్యాసాలు అబ్బుర పరిచాయి. ఆపై జరిగిన సరంగ్ హెలికాప్టర్ టీం, భారత వాయుసేన సంయుక్త విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా, సుష్మా స్వరాజ్ నేడు ఇండియా-అరబ్ లీగ్ కోఆపరేషన్ సమావేశాల్లో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News