: ఏం తింటే బిడ్డ తెల్లగా పుడుతుంది?: సోషల్ మీడియాలో చర్చను రేపిన ప్రశ్న
సోషల్ మీడియాలో ఓ ప్రశ్నను పెడితే దానిపై పెద్ద చర్చ నడుస్తుంది. సలహాలిచ్చేవారు కొందరైతే, వేళాకోళమాడేవారు మరి కొందరు, నిజాయతీగా సలహాలు ఇచ్చేవారు మరి కొందరు. ఏదైతేనేం, ఇండియన్ ఫుడ్ కమ్యూనిటీకి చెందిన సోషల్ మీడియా పేజ్ లో ఓ మహిళ పెట్టిన ప్రశ్న చర్చకు దారితీసింది. 'ఏం తింటే బిడ్డ తెల్లగా పుడుతుంది?'అంటూ తొలిసారి తల్లి కాబోతున్న మహిళ ప్రశ్నించింది. దీనికి నెటిజన్లు విశేషంగా స్పందించారు. "రోజూ కొంచెం ఫెయిర్ నెస్ క్రీం తింటే మీ బిడ్డ తెల్లగా పుడుతుంది" అని ఒకరు సమాధానం చెప్పగా, అంటే "ఆకు పచ్చని ఆకు కూరలు, కూరగాయలు తింటే ఆకుపచ్చగా పుడతారా?" అని మరోకరు ప్రశ్నించారు. "అలా అయితే కొకైన్ తిను, బిడ్డ తెల్లగా పుడతారు" అని ఇంకొకరు సమాధానం ఇచ్చారు. దీనికి విశేషమైన లైకులు వచ్చాయి. మరో మహిళ స్పందిస్తూ "గర్భంతో ఉండగా పాలు, పండ్లు, ఆపిల్స్ తినే వారిని చాలా మందిని చూశాను, కానీ వారిలో ఎవరికీ తెల్లగా ఉండే బిడ్డ పుట్టలేదు" అని సమాధానం ఇచ్చారు. ఇంకొక నెటిజన్ దీనిపై స్పందిస్తూ, "బిడ్డ రంగు జీన్స్ పై ఆధారపడి ఉంటుంది తప్ప తినే తిండిపై కాద"ని అన్నారు. ఇవన్నీ చూసిన ఆ పేజ్ అడ్మిన్ "ఇవి తిరోగమన ఆలోచనలని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో సానుకూలంగా ఆలోచించాల"ని చెప్పారు. అందరికంటే గొప్పగా చెప్పిన సమాధానం ఏంటంటే..."చాలా మంది దంపతులు బిడ్డలు లేక బాధపడుతున్నారు. నీకు బిడ్డ పుడుతోంది. దానికి ఆనందించు, బిడ్డ రంగేదైనా ఆనందంగా స్వాగతం పలుకు" అని అన్నారు.