: ‘శత’క్కొట్టిన ఆసీస్... టీమిండియా లక్ష్యం 331
ఐదో వన్డేలోనూ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు రెచ్చిపోయారు. బ్యాట్లు ఝుళిపించారు. టీమిండియా బౌలింగ్ ను చీల్చి చెండాడారు. టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా, ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ తీసిన టీమిండియా ఫేసర్ ఇషాంత్ శర్మ ఆసీస్ పై పైచేయి సాధించగా, ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (122) వీర విహారం చేశాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా, అతడి స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్ (28) కూడా పెద్దగా రాణించలేదు. జార్జి బెయిలీ(6), షాన్ మార్ష్ (7) వికెట్లు కూడా వెంటవెంటనే కుప్పకూలాయి. ఓ వైపు వికెట్ల పతనం కొనసాగుతుండగా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా వార్నర్ భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. షాన్ మార్ష్ తర్వాత వచ్చిన మిషెల్ మార్ష్ (101) కూడా బ్యాటు ఝుళిపించాడు. మాథ్యూ వేడ్ (36) కూడా ఫరవాలేదనిపించాడు. అయితే, చివర్లో వచ్చిన జేమ్స్ ఫాల్కనర్ (1), జాన్ హేస్టింగ్ (2)లు వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఆసీస్ 330 పరుగులు చేసింది. మరికాసేపట్లో 331 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.