: గో ఎయిర్ ఫ్లయిట్ కు బాంబు బెదిరింపు... నాగ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దేశంలో ఉగ్రవాద హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలపై విరుచుకుపడతామని ప్రకటించిన ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పటికే పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా గో ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు ఎదురైంది. నేటి ఉదయం భువనేశ్వర్ నుంచి ముంబైకి బయలుదేరిన గో ఎయిర్ విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విమానయాన సంస్థకు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెనువెంటనే అప్రమత్తమైన అధికారులు సదరు విమానాన్ని నాగ్ పూర్ లో అత్యవసరంగా దించేశారు. ప్రస్తుతం నాగ్ పూర్ లో విమానాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.