: తెలంగాణలో 4 సెజ్ లు, నిమ్జ్ కు అనుమతులు ఇచ్చాం: నిర్మలా సీతారామన్


తెలంగాణలో 4 సెజ్ (ప్రత్యేక ఆర్థికమండళ్ల)ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు మంత్రి డెవలపర్స్, ఆక్వాస్పేస్, వ్యాల్యూ ల్యాబ్స్, జీఎఆర్ ప్రైవేట్ లకు సెజ్ లు కేటాయించామని వెల్లడించారు. ఇవన్నీ ఐటీ ఆధారిత ఆర్థికమండళ్లని ఆమె పేర్కొన్నారు. వాటితో పాటు మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక జోన్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో ఫార్మా నిమ్జ్ కు సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్టు ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరించారు. ఉత్పాదక జోన్ తో రూ.17,300 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.60వేల కోట్ల టర్నోవర్ లో 2.61 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో పసుపు బోర్డు, స్పైస్ బోర్డు, స్పైస్ పార్కులకు సైతం తమకు ప్రతిపాదనలు అందాయని సీతారామన్ తెలిపారు. తెలంగాణ పారిశ్రామికంగా మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. వాటన్నిటితో తెలంగాణకు 'అచ్చేదిన్' వచ్చినట్టేనని భావించొచ్చని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News