: షానవాజ్ హుస్సేన్ కు ఐఎస్ బెదిరింపులు... లేఖలో అసభ్య పదజాలం
ఇరాక్, సిరియాల్లో పురుడు పోసుకుని ప్రపంచ దేశాల్లో మెరుపు దాడులకు తెగబడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారత్ పై దృష్టి సారించారు. ఈ నెల 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకల్లో విధ్వంసం సృష్టించి తీరతామని ప్రకటించిన ఆ సంస్థ ఇప్పటికే తన ముష్కరులను భారత్ భూభాగంలోకి దింపింది. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన నిఘా వర్గాలు నిన్న దేశవ్యాప్తంగా దాడులు చేసి 14 మందిని అరెస్ట్ చేశాయి. ఓ వైపు ముమ్మర సోదాలు జరుగుతుండగానే... నిన్న బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ కు ఐఎస్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఢిల్లీలోని ఆయన నివాసానికి పోస్ట్ లో ఓ లేఖ వచ్చింది. ఉర్దూ, ఆంగ్లంలో రాసి ఉన్న లేఖలో అసభ్య పదజాలంతో హుస్సేన్ ను ఉగ్రవాదులు దూషించారు. దీనిపై వేగంగా స్పందించిన షానవాజ్.. నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ సోషల్ మీడియాలో తనకు బెదిరింపులు ఎదురయ్యాయని చెప్పిన షానవాజ్... వీటికి భయపడేది లేదని ప్రకటించారు.