: రక్షణ శాఖకు మారనున్న జైట్లీ!... కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా మోదీ అడుగులు
కేంద్ర పన్నుల విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ... కొత్తగా ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించారు. ఈ బిల్లును పార్లమెంటులో పాస్ చేయించుకునేందుకు ఆయన చేయని యత్నం లేదు, ఎక్కని మెట్టూ లేదు. గత పార్లమెంటు సమావేశాల ముందు ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికీ వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. జీఎస్టీ బిల్లు కలగానే మిగిలిపోయింది. ప్రధాని హోదాలో మోదీ ఇంత చేస్తున్నా, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏం చేస్తున్నట్లు? జీఎస్టీ బిల్లును పాస్ చేయించుకునే దిశగా ఆయన చేసిన చర్యలేంటనే చర్చ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలాగైతే కుదరదు... జైట్లీ శాఖను మార్చడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ఆర్థిక శాఖతో పాటు రక్షణ శాఖను కూడా జైట్లీ పర్యవేక్షించారు. అయితే గోవా సీఎం పదవికి మనోహర్ పారికర్ తో రాజీనామా చేయించి మరీ రక్షణ శాఖ బాధ్యతలను మోదీ ఆయన నుంచి తప్పించారు. తాజాగా జీఎస్టీ బిల్లు విషయంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో జైట్లీ నుంచి ఆర్థిక శాఖను తప్పించేందుకు మోదీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జైట్లీకి రక్షణ శాఖను అప్పగించేసి, విద్యుత్ శాఖ మంత్రిగా మెరుగ్గా రాణిస్తున్న పీయూష్ గోయల్ కు ఆర్థిక శాఖ పగ్గాలను అప్పజెప్పే దిశగా మోదీ యోచిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో గోయల్ తనదైన శైలిలో రాణించి సత్ఫలితాలు రాబట్టారు. అయితే, రాజకీయ అనుభవం అంతగా లేని గోయల్ ఆర్థిక మంత్రిగా ఏ మేరకు రాణిస్తారన్న విషయంపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా 2019 ఎన్నికకు మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని మోదీ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షాకు మరో మూడేళ్ల పాటు పార్టీ జాతీయ అధ్యక్ష పదవితో పాటు పాలనలో మెరుగైన ఫలితాలు సాధించే వారికి కీలక బాధ్యతలు అప్పగించే దిశగా మోదీ అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే తన కేబినెట్ ను పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జైట్లీకి స్థానచలనం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.