: చివరి వన్డేకి ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్ దూరం
ఆసీస్ 'హార్డ్ హిట్టర్' గ్లెన్ మ్యాక్స్ వెల్ భారత్ తో చివరి వన్డేకి దూరమయ్యాడు. కాన్ బెర్రా వేదికగా భారత్ తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ వేసిన బంతి మ్యాక్స్ వెల్ మోకాలి కింది భాగంలో బలంగా తాకింది. అయినప్పటికీ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించి కేవలం 20 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేశాడు. అనంతరం కాసేపు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేసిన మ్యాక్స్ వెల్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి పది పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సందర్భంగా గాయం ఇబ్బంది పెట్టడంతో మైదానం వీడాడు. అనంతరం ఫిజియో సూచనల మేరకు మ్యాక్స్ వెల్ కు చివరి వన్డేలో విశ్రాంతి ఇచ్చారు.