: సెంటిమెంట్ కనిపించినా పతనమాపని బుల్!
సెషన్ ఆరంభంలో నూతనంగా ఈక్విటీ కొనుగోళ్లకు మద్దతు పలికిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఆపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ట్రేడింగ్ కు దూరంగా జరిగేసరికి స్టాక్ మార్కెట్లలో నష్టం కొనసాగింది. ట్రేడింగ్ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, ఒక దశలో 150 పాయింట్ల నష్టాన్ని చవిచూసినప్పటికీ, చివరి అరగంట వ్యవధిలో వచ్చిన షార్ట్ కవరింగ్ కొంత పతనాన్ని నిలువరించింది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 99.83 పాయింట్లు పడిపోయి 0.41 శాతం నష్టంతో 23,962.31 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 32.50 పాయింట్లు పడిపోయి 0.44 శాతం నష్టంతో 7,276.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.30 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.53 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 21 కంపెనీలు లాభాల్లో నడిచాయి. యాక్సిస్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 90,33,421 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మొత్తం 2,770 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,328 కంపెనీలు లాభాలను, 1,261 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.