: పాక్ అణ్వాయుధాలు... భారత్ ను భయపెట్టేందుకే!: అమెరికా సంచలన నివేదిక
దాయాది దేశం పాకిస్థాన్ వద్ద ఎన్ని అణు బాంబులున్నాయి? 110, 130... ఇంకా అంతకంటే ఎక్కువేనట. ఇటీవలి కాలంలో ఆ దేశం తన అణు సంపత్తిని పెంచుకుంటూనే ఉంది. ఎందుకోసం?, భారత్ పై దాడి చేసేందుకా?.. కానే కాదట. భారత్ వైపు నుంచి మిలిటరీ దాడిని నిలువరించేందుకేనట. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా చట్టసభ కాంగ్రెస్ కు చెందిన ‘కాంగ్రెసెనల్ రీసెర్చి సర్వీస్ (సీఆర్ఎస్)’ సంచలన నివేదికను బయటపెట్టింది. భారత్ నుంచి పొంచి ఉన్న సైనిక చర్య నుంచి తప్పించుకునేందుకే పాకిస్థాన్ తన అణ్వస్త్ర పాటవాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటోందని సీఆర్ఎస్ నివేదిక తేల్చిచెప్పింది. ప్రస్తుతం తనపై సైనిక చర్యను నిలువరించేందుకే పాక్ అణు బాంబుల సంఖ్యను పెంచుకుంటున్నా, భవిష్యత్తులో భారత్, పాక్ ల మధ్య అణు యుద్ధం జరిగే ప్రమాదం పొంచే ఉందని ఆ సంస్థ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో కీలక దేశాలుగా ఉన్న భారత్, పాక్ ల మధ్య అణు బాంబులు పడితే, దక్షిణాసియా ప్రాంతానికే పెను ముప్పు తప్పదని కూడా ఆ నివేదిక డేంజర్ బెల్స్ మోగించింది. సీఆర్ఎస్... అమెరికా కాంగ్రెస్ కే చెందినప్పటికీ, ఆ సంస్థ రూపొందించే నివేదికలకు అధికారిక ముద్ర ఉండదు. అయినప్పటికీ ఆ సంస్థ నివేదికలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నివేదిక ప్రస్తుతం భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతోంది.