: ‘జూనియర్’కు టీటీడీపీ పగ్గాలు ఇవ్వాలి... ట్రస్ట్ భవన్ లో తెలుగు తమ్ముళ్ల ఆందోళన
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిన్న తెలుగు తమ్ముళ్లు వినూత్న డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. నందమూరి వంశంలో మూడో తరానికి చెందిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ తెలంగాణ శాఖ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యతో పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అభిమానులకు న్యాయం చేసే అవకాశం ఉందని వాదించారు. ఈ మేరకు మెరుపు ఆందోళనకు దిగిన పార్టీ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నిరసనకు దిగారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టికెట్లను టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ కలసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు హైదరాబాదుకు చెందిన పార్టీ నేత నైషధం సత్యనారాయణమూర్తి కూడా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు ఇదే వాదనతో నిరసనకు దిగారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలను అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.