: పది రోజుల్లోగా విడుదల చేయకుంటే యుద్ధమే!... గుజరాత్ సర్కారుకు హార్దిక్ లేఖ
గుజరాత్ పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టి యువ సంచలనంగా పేరుగాంచిన హార్దిక్ పటేల్ తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. పది రోజుల్లోగా తనతో పాటు మిగతా పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేతలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. ‘‘మమ్మల్ని విడుదల చేసేందుకు ప్రభుత్వానికి పది రోజుల సమయమిస్తున్నాం. ఆ తర్వాత ఇక యుద్ధమే’’ అంటూ ఆయన రాసిన లేఖ ప్రస్తుతం పటేల్ సామాజికవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంతో తమ నేతలు చర్చలకు సిద్ధంగానే ఉన్నారని, అయితే రిజర్వేషన్ల డిమాండ్ ను పణంగా పెట్టి మాత్రం చర్చల్లో ముందుకెళ్లబోమని ఆయన ప్రకటించారు. రాజద్రోహం ఆరోపణల కింద అరెస్టై ప్రస్తుతం సూరత్ జైల్లో ఉన్న హార్దిక్ ను నిన్న కొందరు పటేల్ సామాజిక వర్గ పెద్దలు కలిశారు. ఆ తర్వాత హార్దిక్ నుంచి ఈ లేఖ విడులైంది. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్న హార్దిక్, బీజేపీ నేతల్లో ఏ ఒక్కరితోనూ తమకు విభేదాలు లేవని తేల్చిచెప్పారు. రిజర్వేషన్ల కోసం తాము ఏ ప్రభుత్వమున్నా ఆందోళన చేసేవారమని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నా, ఇదే వైఖరితో ముందుకెళ్లేవాళ్లమని కూడా హార్దిక్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై ఆనందిబెన్ పటేల్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్న విషయం తేలాల్సి ఉంది.