: భారత్ ముందున్న భారీ లక్ష్యం 349
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య కాన్ బెర్రాలో జరుగుతున్న వన్డే పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులను సాధించింది. ఓపెనర్లు వార్నర్ 93, ఫించ్ 107 పరుగులకు తోడు కెప్టెన్ స్మిత్ 51 (29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు), మార్ష్ 33 పరుగులతో రాణించారు. మిగిలిన ఆటగాళ్లలో బెయిలీ 10, ఫాల్కనర్ 0 పరుగులతో నిరాశ పరచగా, మాక్స్ వెల్ మెరుపులు మెరిపించాడు. తానెదుర్కొన్న 19 బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 41 పరుగులు చేసి 50వ ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి ఆతిథ్య జట్టు భారీ స్కార్ ను సాధించింది. భారత బౌలర్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇషాంత్ శర్మ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నారు. చివర్లో పేసర్లు కొంత నియంత్రించి వికెట్లు తీయకుంటే ఆస్ట్రేలియా జట్టు మరో 20 పరుగులన్నా జోడించి వుండేది. మరికాసేపట్లో 349 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.