: రోహిత్ ను ఎందుకు సస్పెండ్ చేశామంటే..: తొలిసారిగా నోరు విప్పిన వీసీ అప్పారావు


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా, వర్శిటీ వీసీ తొలిసారిగా ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రోహిత్ తో బాటు, మరో నలుగురిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్న విషయమై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సస్పెన్షన్ నిర్ణయం వెనుక తమపై కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, లేదా బండారు దత్తాత్రేయల ఒత్తిడి ఎంతమాత్రమూ లేదని ఆయన తెలిపారు. దాదాపు ఐదు నెలల క్రితమే వివాదం మొదలైందని తెలిపారు. "గత సంవత్సరం ఆగస్టులో ఉగ్రవాది యాకూబ్ మెమన్ ను ఉరి తీసిన తరువాత ఐదుగురు విద్యార్థులు ఆయనపై ఓ డాక్యుమెంటరీని తీసి వర్శిటీలో ప్రదర్శించారు. ఈ తరహా చర్యలు తగవని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును ఉంచడంతో, ఈ ఐదుగురూ కలసి అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆపై కేసు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, విద్యార్థుల జీవితం పాడవుతుందని నేను మధ్యవర్తిత్వం చేసి కేసు లేకుండా చేశాను. ఆపై ఏబీవీపీ జరిగిన సంఘటనను వివరిస్తూ, బండారు దత్తాత్రేయకు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఆయన అదే లేఖను ప్రస్తావిస్తూ, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చర్యల నిమిత్తం పంపారు. ఆపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఘటనను పరిశీలించాలని మాకు లేఖ అందింది. ఆపై ఓ కమిటీని వేసి ఘటన పూర్వాపరాలను వెలికితీయాలని సూచించగా, సదరు క్రమశిక్షణా కమిటీ విద్యార్థులపై చర్యలకు సిఫార్సు చేసింది. ఆపై సమావేశమైన వర్శిటీ ఉన్నతాధికారులు నెల రోజుల సస్పెండ్ ను ప్రటించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు డీన్ ను, డీన్ ఫ్యాకల్టీని సంప్రదించడం కూడా జరిగింది. వారిపై పోలీసు కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కూడా చేశాం. ఈ విషయమై కోర్టు కూడా కల్పించుకుంది. ఏదిఏమైనా విద్యార్థి మృతి దురదృష్టకరం" అని ఆయన అన్నారు. రోహిత్ తో పాటు మరో నలుగురినీ సస్పెండ్ చేశామని, వర్శిటీలో ఎటువంటి అసాంఘిక శక్తులు చెలరేగకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. విద్యార్థుల భావ ప్రకటనా హక్కులను హరిస్తున్నామని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News