: మీకు నేను అండగా ఉంటా... రోహిత్ తల్లికి వైఎస్ జగన్ భరోసా
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ కుటుంబానికి అండగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. ఉప్పల్ లోని రోహిత్ నివాసానికి ఈరోజు సాయంత్రం ఆయన వెళ్లారు. రోహిత్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక కన్నీటి పర్యంతమయ్యారు. రోహిత్ ను వర్శీటి నుంచి సస్పెండ్ చేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ‘కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చిన రోహిత్ త్వరలో శుభవార్త వింటారని చెప్పాడు. కుట్ర కారణంగా నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణం వర్శిటీ వీసీయే. ఆయన్ని తక్షణం పదవి నుంచి తప్పించాలి’ అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు.