: ప్రభాస్ ఒప్పుకున్నాడు...మాదే ఆలస్యం: రెబల్ స్టార్ కృష్ణంరాజు
పెళ్లి చేసుకోవడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బాహుబలి2 పూర్తైన తరువాత పెళ్లి జరిగే అవకాశం ఉందని అన్నారు. సంబంధాలు చూడడమే ఆలస్యమని, బాధ్యత తమపైనే ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు తెలుగు తెలిసిన ప్రాంతాల్లో బయటకు వెళ్తే తనను చుట్టుముట్టేవారని, ఇప్పుడు ముంబై, ఢిల్లీ లాంటి చోట్ల కూడా గుర్తుపడుతున్నారని అన్నారు. అయితే గతంలో అంతా తనను కృష్ణంరాజుగా గుర్తుపట్టేవారని, ముంబై, ఢిల్లీల్లో ప్రభాస్ పెదనాన్నగా గుర్తిస్తున్నారని, తనకు అంతకంటే కావాల్సింది ఏముంటుందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ బాగుందని, యువ నటులు ప్రతిభను చాటుకుంటున్నారని, సీనియర్లు వయసుకుతగ్గ పాత్రలు చేయడానికి ఇబ్బంది పడడం లేదని ఆయన తెలిపారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు మంచి సంకేతమని ఆయన పేర్కొన్నారు.