: మోదీ మార్గంలో వెళ్లి ఢిల్లీ వాసులను బాదుతున్న కేజ్రీ సర్కారు!
అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గుతుంటే, ఆ ప్రయోజనాలను భారతీయులకు అందించేందుకు కేంద్రం ఏ మాత్రం ఆసక్తిని చూపకుండా పన్నులు పెంచుకుంటూ పోతున్న వేళ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు కూడా అదే మార్గాన పయనించింది. రాష్ట్ర ఖజానా నిండుకుంటున్నదని వంక చూపెడుతూ, లీటరు పెట్రోలుపై ఉన్న స్థానిక అమ్మకపు పన్నును 25 శాతం నుంచి 27 శాతానికి, డీజిల్ పై ఉన్న 16.6 శాతం పన్నును 18 శాతానికి పెంచింది. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చినట్టని వెల్లడించింది. వీటికి అదనంగా డీజిల్ పై 25 పైసల కాలుష్యపు పన్నును విధించింది. ఈ మార్పు తరువాత ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 96 పైసలు, డీజిల్ ధర 53 పైసలు పెరిగి వరుసగా రూ. 59.03, రూ. 44.71లకు చేరాయి. మోదీ సర్కారు నిర్ణయాలను నిత్యమూ విమర్శించే కేజ్రీవాల్, పెట్రోలు ధరల విషయంలో మాత్రం ఆయన మార్గంలోనే నడుస్తున్నారన్న విమర్శలు రావడం మొదలైంది.