: నేలపై కూర్చున్న రాహుల్ గాంధీ... రోహిత్ ఆత్మహత్య కారణాలపై సుదీర్ఘ ఆరా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నేలపై కూర్చుకున్నారు. రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ వర్సిటీ చేరుకున్నారు. వర్సిటీలో రోహిత్ తల్లిని పరామర్శించిన ఆయన... రోహిత్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రోహిత్ తో పాటు వర్సిటీ నుంచి సస్పెన్షన్ కు గురైన నలుగురు విద్యార్థులతో మాట్లాడేందుకు రాహుల్ గాంధీ నేలపై కూర్చున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాహుల్ గాంధీతో పాటే నేలపై కూర్చుకున్నారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అతడి స్నేహితులు చెబుతుంటే, రాహుల్ సాంతం విన్నారు. అంతేకాక పలు సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు వేసిన రాహుల్ గాంధీ వివరాలన్నీ సేకరించారు. రాహుల్ రాకను స్వాగతిస్తూ ఓ వైపు విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నా, రోహిత్ స్నేహితులు చెబుతున్న విషయాలను రాహుల్ గాంధీ ఆసక్తిగా ఆలకించారు.